వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నార్త్ కరోలినాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. ఈ క్రమంలో బైడెన్ వైఖరిని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతీకార దాడులను ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలతో మొదలు పెట్టాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి అణ్వాయుధాలతోనే పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ముందుగా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలన్నారు. ఆ తర్వాత మిగతా టార్గెట్లపై ఆలోచించొచ్చన్నారు.