సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం vs బిఆర్ఎస్ గా మారింది. సీఎం పై కేటీఆర్ , హరీష్ రావు లు మాటల యుద్ధం చేస్తున్నారు. ‘ఎమ్మెల్యేగా లేనప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు అన్నావ్ కదా..? ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? బీఆర్ఎస్లో నా శిష్యుడిగా ఉన్నావు. నాతోపాటు నా కారు ముందు డాన్స్ చేశావు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్పార్క్ వద్ద నా వెనకాల నిలబడ్డావు. నువ్వు చిన్నగా ఉంటావు కాబట్టి టీవీలో కనబడటానికి నిక్కి నిక్కి చూసినోడివి నువ్వు’ అంటూ సీఎం రేవంత్ పై హరీష్ రావు విరుచుకపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే మూసీ పునరుజ్జీవనం ప్రారంభించామన్నారు. రేవంత్ చూపించింది రివర్ ఫ్రంట్ అని చెప్పారు. రూ.3800 కోట్లతో కేసీఆర్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, గోదావరి జలాలను మూసీకి తేవడానికి రూ.1100 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును మార్చి రూ.4 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.
‘మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పాడు.. కానీ విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్ టైం స్క్వేర్‌ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్‌ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్ లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టిండు. ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక్క దగ్గర వేసి దంచి నూరి ఏఐలో వేసి తీసినట్టున్నపంచవన్నెల దృశ్యాలను చూపించాడు. నది పునరుజ్జీవనం అంటే సజీవంగా గలగలపారే స్వచ్ఛమైన జలాలు.. అద్దాల బిల్డింగులు ఉండవంటూనే ఎన్నెన్నో అందాలను చూపించారు. ముఖ్యమంత్రి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల చూపించిన వీడియో కరెక్టా?. మీ ప్రజెంటేషన్‌లో రివర్ రెజువనేషన్, రివర్ ఫ్రంట్ అని ఉంది.. రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనం. మరి ఈ రివర్ ఫ్రంట్ ఏంది.. దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంది?.
రేవంత్.. నీది నోరా మోరా? మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా 50 వేలు ఖర్చుపెడతామని నీ నోటితో నువ్వే చెప్పి, ఇప్పుడు సిగ్గులేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నవ్..అంటూ హరీష్ ఫైర్ అయ్యారు.