హరియాణా ఎన్నికల కౌంటింగ్‌లో మొదట కనిపించిన ఫలితం పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్ సపోర్టర్స్ తీవ్ర నిరాశ చెందారు. తొలి అరగంటలో 50+ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉండటంతో వారంతా లడ్డూ, జిలేబీలు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ, గెలుపు గుర్రాలు బీజేపీ వైపు ఉండటంతో కాంగ్రెస్ కార్యాలయం కళ తప్పింది. ముందుగా ఏర్పాటు చేసిన డప్పు కళాకారులను తిరిగి పంపించేస్తున్నారు.
కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడింది. అధికార బీజేపీ లీడ్‌లోకి దూసుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ అభ్యర్థులు 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఏకంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి 55కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని లెక్కలుగట్టాయి. కానీ ప్రస్తుత సరళిని చూస్తుంటే ఫలితాలు భిన్నంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కౌంటింగ్ మొదలు కాకముందే గెలుపు సంబరాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గాయి. వేడుకలను నిలిపివేశాయి.