రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ టైమింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టైమింగ్స్‌ను పొడిగించారు. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
విద్యార్థులు సరిగా రాణించకపోవడంతోనే గంటసేపు టైమింగ్స్ పెంచామని.. ఆ గంటసేపు విద్యార్థులు కాలేజీల్లోనే చదువుకుంటారని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కాలేజీల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్స్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు నమూనాను కాలేజీలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులకు వారికి లేత పసుపు రంగు, సెకండియర్ విద్యార్థులకు నీలం రంగు కార్డులను ముద్రించి ఇవ్వాలని సూచించారు.