హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ కనిపించని ముఖం
చెన్నై: హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు తన పోరాటాన్ని ఉదృతం చేసింది. ఆ భాషను ఎట్టి పరిస్థితిలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ భాషను కచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నామని, హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ కనిపించని ముఖం అన్నారు. పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

25 ప్రాచీన భాషలు అంతరించిపోయినట్లు స్టాలిన్ తన లేఖ
మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్ర సర్కారు కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయాన్ని డీఎంకే వ్యతిరేకిస్తున్నది. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లో మాట్లాడే మిథిలీ, బ్రజ్‌భాషా, బుందేల్‌ఖండ్, అవధి లాంటి స్థానిక భాషలు.. హిందీ భాష ఆధిపత్యం వల్ల కనుమరుగైపోతున్నాయని స్టాలిన్ తన లేఖలో తెలిపారు. హిందీ-సంస్కృత భాషల ఆధిపత్యం వల్ల ఉత్తరాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాషలు అంతరించిపోయినట్లు స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్తు అంతా సంస్కృతమే అవుతుంది
మూడు భాషల పాలసీ షెడ్యూల్ ద్వారా.. చాలా వరకు రాష్ట్రాల్లో సంస్కృతాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాజస్తాన్‌లో.. ఉర్దూ టీచర్లకు బదులుగా సంస్కృత టీచర్లను రిక్రూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తే, అప్పుడు మాతృభాషని పట్టించుకోరు అని, భవిష్యత్తు అంతా సంస్కృతమే అవుతుందని స్టాలిన్ తెలిపారు. ద్రవిడ నేత, దివంగత మాజీ సీఎం సీఎన్ అన్నాదురై.. తమిళనాడులో ద్విభాషా విధానం అమలుకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు చెప్పారు. హిందీ-సంస్కృతం అమలు వల్ల తమిళ సంస్కృతి నష్టపోతుందని ఆయన అంచనా వేసినట్లు స్టాలిన్ చెప్పారు.