నేటి నుంచి బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వుల నడుమ పుప్పొడిని, పసుపు ముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి.

పూల పండుగ ‘బతుకమ్మ’ సంబరాలు నేటి నుంచి 9 రోజులపాటు జరగనున్నాయి. మహా అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. తొలి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను జరుపుకుంటారు. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 9 రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.

9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాల్లో మునిగితేలుతారు. ఊరు వాడ చిన్నా పెద్ద తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చుతారు. సాయంకాలం ప్రధాన కూడళ్ళకు బతుకమ్మలను తీసుకెళ్ళి వాటి చుట్టూ లయబద్దంగా తిరుగుతూ ఆడిపాడిపాడుతారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకలను రోజుకో పేరుతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహిస్తారు. రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మనాడు తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమ తో గౌరమ్మను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆటపాటలతో గౌరీ దేవిని కొలిచి చివరకు బతుకమ్మలను పారేనీళ్ళలో నిమజ్జనం చేస్తారు. పసుపు కుంకుమలతో ముత్తయిదు మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పిండి వంటలను ప్రసాదంగా స్వీకరిస్తారు.