తమిళ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు కొత్తగా వచ్చిన కామెడీ డ్రామా ‘బేబీ అండ్ బేబీ‘ మళ్లీ వార్తల్లో నిలిచింది. జై హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే, థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ‘సన్ నెక్స్ట్’ ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 4నుంచి ‘ఆహా’ తమిళ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.ఈ సినిమాలో జై సరసన ప్రజ్ఞా నగ్రా నటించింది. ఈమె తెలుగులో ‘లగ్గం’ సినిమాతో పరిచయమైనప్పటికీ, తమిళంలో ఇది ఆమె మూడో సినిమా కావడం విశేషం. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువరాజ్ నిర్మించగా, సత్యరాజ్, యోగిబాబు, ఇళవరసు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ రెండు జంటల చుట్టూ తిరుగుతుంది.

ఒకేసారి ఇద్దరు మహిళలకు పిల్లలు పుట్టడం, అనుకోని పరిస్థితుల్లో శిశువులు మారిపోవడం ప్రధాన కథాంశం. తల్లిదండ్రుల అనుమానాలు, కలతలు, ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ వినూత్న కథనాన్ని ప్రేక్షకులు ఎంతవరకు స్వీకరిస్తారో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.సినిమా థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీ వేదికపై తనదైన గుర్తింపు సంపాదించుకునే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు ఉన్న క్రేజ్‌ను గమనిస్తే, కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకర్షించేలా కనిపిస్తోంది. మరి, ‘ఆహా’లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి!