అమరావతి: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామాకు గల కారణాలను ఆయన స్పష్టతనిచ్చారు. రాజకీయాల వల్ల కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని… వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయాల్లోనిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశానని అన్నారు.
ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఓ ఏడాది సమయమైనా ఇవ్వాలని.. ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండానే ఇప్పుడు నేతలందరిని ఒకేసారి రోడ్డు ఎక్కి ధర్నాలు చేయాలంటే ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. నా హయాంలో నేనెలాంటి అవినీతి చెయ్యలేదు.. అవినీతిని ప్రోత్సహించలేదు. ఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి.. ఆరు నెలల నుంచి ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్‌లే నడిపించారు.
బ్రిటిష్ వారు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందిందని… మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు.. సీఎంలు కావచ్చు ఎన్నికల ముందు ఒక ఆకాంక్షతో వచ్చి.. ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇబ్బందులు వస్తాయని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.