Waqf Amendment Bill : ఎట్టకేలకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. ఈ క్రమంలోనే వక్ప్ బిల్లు ఆమోదంపై ప్రధాన నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని కామెంట్ చేశారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లుతో అట్టడుగునే మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టంగా రూపాంతరం
కాగా, బిల్లుపై లోక్‌సభ ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 288, ప్రతికూలంగా 232 ఓట్ల రావడం బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్యసభ లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపినట్లు అయింది. అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా రూపాంతరం చెందనుంది. వక్ఫ్ బిల్లు పేరును…యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.