అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్ మారుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం పేరును మార్చేసింది. ఈ మేరకు ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరును మారుస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పథకం పేరు మార్చాలంటూ గ్రామ సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున విజ్క్షప్తులు రావడంతో పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులు ప్రభుత్వం నుంచి రూ.10 వడ్డీ లేని రుణాన్ని పొందనున్నారు.
కాగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం ‘జగనన్న తోడు’ పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు.