అమరావతి: అమరావతి నిర్మాణం చుట్టూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పరిగణించడంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సుప్రీం కోర్టుకు వివరించింది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలైంది. దీంతో వివాదాన్ని ముగించాలని ఎన్డీఏ భావిస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా రాజధానిని ఖరారు చేసేలా అడుగులు వేస్తున్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించిన తర్వాత రాజధానిని సాధికారికంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాజధాని మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు భూసమీకరణలో నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో గత ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజధాని నిర్మాణంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి. భూములుచ్చిన రైతులకు భాగంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడేళ్లలో పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొంది. రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికేలా, ఇప్పటికే జరిగిన జాప్యం, నష్టాన్ని, రైతులు, రాష్ట్ర ప్రజల న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కోర్టు ముందున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరింది.