కేరళలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి పునాది వేయడానికి అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025లో అదానీ గ్రూప్ రూ. 30,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ప్రధానంగా పోర్టుల అభివృద్ధి, ఎయిర్ పోర్ట్ విస్తరణ, లాజిస్టిక్స్ సదుపాయాల కల్పన వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్ MD కరణ్ అదానీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కేరళలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అదానీ గ్రూప్ కీలక భూమిక పోషించనుంది.

Vizhinjam పోర్టు అభివృద్ధి – రూ. 20,000 కోట్ల పెట్టుబడి
అదానీ గ్రూప్ కేరళలో Vizhinjam పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ, మరో రూ. 20,000 కోట్లు వెచ్చించి పోర్టును మరింత విస్తరించనుంది. ఈ పోర్టు 24,000 కంటైనర్ల కెపాసిటీతో ప్రపంచంలోని ప్రధాన పోర్టులతో అనుసంధానించనుంది. అంతర్జాతీయ రవాణా మార్గాలను మెరుగుపరిచేందుకు ఇదొక కీలక ప్రాజెక్టుగా మారనుంది.
తిరువనంతపురం ఎయిర్‌పోర్టు విస్తరణ & కొత్త ప్రాజెక్టులు
అదానీ గ్రూప్ రూ. 5,500 కోట్లతో తిరువనంతపురం ఎయిర్‌పోర్టును విస్తరించనుంది. ప్రస్తుతం ఏడాదికి 45 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్ పోర్టును 1.20 కోట్ల మందికి వృద్ధి చేయనుంది. అలాగే కొచ్చిలో లాజిస్టిక్స్ & ఈ-కామర్స్ హబ్ నిర్మించడంతో పాటు సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని పెంచనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కేరళ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతామని కరణ్ అదానీ తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావాలని, అదుకోసం మౌలిక సదుపాయాల కల్పన ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.