A.R. Rahman : ప్రఖ్యాత గాయకులతో రెహమాన్ సంగీత కచేరీలు సంగీత ప్రియులకు ఇది నిజమైన పండుగ వార్తే! ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన వరల్డ్ టూర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సంగీత ప్రయాణం మే 3న ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో అట్టహాసంగా మొదలుకానుంది. ‘వండర్‌మెంట్’ (Wonderment) పేరుతో జరగనున్న ఈ వరల్డ్ టూర్ ద్వారా రెహమాన్ తన మాయాజాల సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించబోతున్నారు.ముంబైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెహమాన్ మాట్లాడుతూ,”ముంబైకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఈ నగరం ఎప్పుడూ నన్ను ప్రేరేపించింది.

అందుకే నా వరల్డ్ టూర్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది” అని చెప్పారు.ఈ టూర్‌లో రెహమాన్‌తో పాటు ప్రఖ్యాత గాయకులు, సంగీత విద్వాంసులు, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారు.అభిమానులకు ఈ సంగీత సందడి ఓ జ్ఞాపకాల పండుగగా మారనుంది.ఇటీవల రెహమాన్ డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పూర్తి చేసుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలతో మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని ఊహాతీతమైన శక్తితో కొనసాగించేందుకు రెడీ అయ్యారు.ఏఆర్ రెహమాన్ పేరు భారతీయ సంగీత ప్రపంచానికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు. హిందీ, తమిళంతో పాటు ఎన్నో భాషల్లో తన అద్భుతమైన స్వరాలను అందించిన ఆయన, అంతర్జాతీయంగా భారతీయ సంగీతాన్ని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లిన మొదటి సంగీత దర్శకుల్లో ఒకరు.ఎప్పుడూ సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసే రెహమాన్, తన కెరీర్‌లో అనేక అంతర్జాతీయ అవార్డులు, ఘనతలు సాధించారు.
ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు
రెండు ఆస్కార్ అవార్డులు
రెండు గ్రామీ అవార్డులు
ఒక బాఫ్టా అవార్డు
ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు
18 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2010లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్
ఇంతటి ఘన విజయాలను అందుకున్న రెహమాన్ ఇప్పుడు ‘వండర్‌మెంట్’ టూర్ ద్వారా తన సంగీత ప్రయాణాన్ని మరో అద్భుతమైన మెరుగుతో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు.ప్రపంచవ్యాప్తంగా రెహమాన్ అభిమానులు, సంగీత ప్రియులు ఈ టూర్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యూజిక్ లవర్స్‌కు ఇది ఒక లైవ్ కాన్సర్ట్‌ను మాత్రమే కాదు, ఒక మ్యూజికల్ యాత్రను ప్రత్యక్షంగా అనుభవించగల గొప్ప అవకాశం.ఏఆర్ రెహమాన్ ‘వండర్‌మెంట్’ వరల్డ్ టూర్ సంగీత ప్రపంచంలో మరో చరిత్రగా నిలిచిపోవడం ఖాయం. ఆయన సంగీత మాయాజాలాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అదృష్టం అభిమానులకు త్వరలోనే లభించబోతోంది