రాజౌరి: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో పేలుడు సంభవించింది. రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రాజౌరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఖంబ ఫోర్ట్ సమీపంలో గోర్భా రైఫిల్స్ గస్తీ నిర్వహిస్తు్న్న సమయంలో మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో పేలుడు ఘటన సంభవించింది.

సరిహద్దుల భద్రత, చొరబాట్ల నిరోధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక మందుపాతరపై గస్తీ జవాను ఒకరు కాలు వేయడంతో అది పేలిందని, దీంతో ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వర్షాల కారణంగా మందుపాతరలు డిస్‌ప్లేస్ అవుతుంటాయని చెబుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించి ఇతమిత్థమైన కారణంపై ఆర్మీ విచారణ ప్రారంభించింది.
కాగా, జనవరి 4వ తేదీన జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తూ బందీపోర్ వద్ద లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సైనికులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.