ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. రెండున్నర గంటలుగా వేర్వేరు విభాగాలకు చెందిన డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహిస్తోన్నట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మటిక్ సర్జన్ డాక్టర్ లీలా జైన్, అనస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోన్నామని తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీలు నిర్వహించామని పేర్కొన్నారు. శరీరంపై మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లను గుర్తించామని డాక్టర్ నీరజ్ చెప్పారు. రెండు లోతైన గాయాలు ఉన్నాయని వివరించారు. మెడ-వెన్నెముక వద్ద కత్తి గాయమైందని, అందులో చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించామని తెలిపారు. జాగ్రత్తగా దాన్ని తొలగించాల్సి ఉంటుందని, సర్జరీ కొనసాగుతోందని పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తోన్నారు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. సైఫ్ అలీను మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీనితో సైఫ్ అలీ అక్కడే రక్తపుమడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.