హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా ఆయని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.
మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీసు ముందు ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించని పరిస్థితి. గన్‌పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయ్కార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.