ముంబయి: కరోనా తర్వాత చాలా మంది ద్విచక్ర వాహనాలపై తిరగడం తగ్గించారు. చాలా మంది ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రభుత్వ రవాణా వ్యవస్థను నమ్ముకోవడం లేదు. సొంతంగా కార్లు తీసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజల్లోనూ కొనుగోలు శక్తి పెరగడంతో ఫోర్ వీలర్స్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇక మీదట కార్లు కొనాలనుకునే వారికి ఇంటి ఎదుట పార్కింగ్ స్థలం ఉంటేనే రిజస్ట్రేషన్‌కు చాన్స్ ఇస్తామని ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్య నివారణ తగ్గించేందుకు సీఎం ఫడ్నవీస్ ఈ కొత్త రూల్ తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రూల్ తేస్తే కారు కొనాలనుకునే వారు ముందుగా పార్కింగ్ ఏరియా సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్‌పూర్, పుణెతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ తేవాలని మహాసర్కార్ యోచిస్తోంది.
జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని ప్రతాప్ సర్నాయక్ అన్నారు. పలు అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న వారికి తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాళ్లు కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారని… దీనివల్ల పార్కింగ్ సమస్య ఎక్కువవుతోందని చెప్పారు. అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని తెలిపారు. అందుకే పార్కింగ్ ఉన్నవారికే కార్లను విక్రయించాలనే నిబంధనను తీసుకొస్తున్నామని చెప్పారు.