కేరళ, తమిళనాడు తీరాలకు సంబంధించి అధికారుల నుండి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులను కల్లక్కడల్ అని పిలుస్తారు. ఇవి ప్రమాదకరమైన అలలతో తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఈ రోజు రాత్రి సముద్రంలో ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీవోఐఎస్) తెలిపింది.
ఈ అలల ప్రభావం రాత్రి 11:30 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రతీరంలో మీటరు మేర వరకు అలలు ఎగసిపడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు జారీచేశారు. కల్లక్కడల్ కారణంగా తీరప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయని, వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు హెచ్చరించారు.
ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలను రాత్రి లోపలే తీరానికి చేర్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. చిన్నచిన్న పడవలు, దేశవాళీ పడవలతో సముద్రంలోకి వెళ్లొద్దని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవించవచ్చని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై తాత్కాలికంగా నిషేధం విధించారు.
పర్యాటకులు కూడా బీచ్‌ల వద్దకు రాకూడదని ఆదేశాలు జారీచేశారు. అలలు బలంగా ఎగసిపడే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇది పూర్తిగా ఆపద్బంధ పరిస్థితి అని, అవసరమైనంత వరకు పర్యటనలు నిలిపివేయాలని సూచించారు.
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందించే మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. కల్లక్కడల్ ప్రభావం తగ్గే వరకు తీర ప్రాంతాల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.