తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంలు విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరినప్పటికీ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించి ప్రస్తుత ఛార్జీలను కొనసాగించాలని ఆదేశించింది.
విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తమ నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. కానీ ప్రభుత్వం దీనిని అంగీకరించలేదు. ప్రజలపై భారం పెరగకుండా చూడటమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు కాకుండా ప్రస్తుత ఛార్జీలను కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు డిస్కంలు ఈనెల 18న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC)కు తమ ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించేందుకు సంబంధిత సమాచారాన్ని సమర్పించనున్నారు.
డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భర్తీ చేస్తే విద్యుత్ ఛార్జీల పెంపు అవసరం ఉండదని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ, డిస్కంలను ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమైంది. ప్రజల పైకి ఛార్జీల భారం పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం కీలకంగా నిలుస్తుంది. విద్యుత్ ఛార్జీల పెంపు లేకపోవడం ప్రజలకు భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు సహాయకరంగా ఉంటుందని, డిస్కంల ఆర్థిక సమస్యలను సబ్సిడీ ద్వారా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను సజావుగా కొనసాగించనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.