తమిళ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్‌హిట్ సినిమాలతో ఆయన తెలుగు అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. నిజానికి రవి అసలు పేరు రవి మోహన్.ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ ఎ. మోహన్ కుమారుడైన రవి, తన నటనా ప్రస్థానాన్ని ‘జయం’ సినిమా ద్వారా ప్రారంభించారు.ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయన పేరు జయం రవిగా మారిపోయింది.ఆయన అన్నయ్య మోహన్ రాజా కూడా ప్రముఖ దర్శకుడిగా తనదైన గుర్తింపు పొందారు. మోహన్ రాజా దర్శకత్వంలో రవి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
రవి నటనపై ఆసక్తితో ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందారు.చిన్నతనంలోనే తన తండ్రి నిర్మించిన సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన రవి, ‘జయం’ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.’M.కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘దాస్’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించారు.యాక్షన్, కామెడీ చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చాటారు.2019 తర్వాత రెండు సంవత్సరాల విరామం తీసుకుని 2021లో ‘భూమి’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2022లో మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం ఆయన ‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 2009లో ప్రముఖ టీవీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని రవి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు ఆరవ్ ‘టిక్ టిక్ టిక్’ సినిమాలో నటించాడు. అయితే, 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికుతూ ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ వార్తతో రవి వార్తల్లో నిలిచారు.ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా రవి తన అసలు పేరు రవి మోహన్‌ను తిరిగి ఉపయోగించనున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.