అమరావతి: ఏపీలో సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందెలు, వాటిపై భారీగా బెట్టింగ్స్ సైతం వేస్తున్నారు. కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి మహింద్రా థార్ ను సైతం గిఫ్ట్‌గా ప్రకటించారు నిర్వాహకులు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కరప పందెం బరి గెలిచిన వారికి థార్ వాహనం గిఫ్ట్ అని జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన కోడి పందేల్లో కోళ్లకు కత్తులు లేకుండా డింకీ పందెలు వేశారు. అయినా సరే తమ పుంజుదే విజయం అంటే, కాదు మాదే అంటూ కోడిపుంజుల ఓనర్లు మీసాలు మెలేస్తున్నారు.
అటు బెజవాడలోనూ కోడి పందెలలో తగ్గేదేలే అంటూ సాగిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు ఏర్పాటు చేసి నిర్వాహకులు పోటీలు జరిపిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, గన్నవరం, నున్న, అంపాపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహణకు బరులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వేల రూపాయల నుంచి లక్షల రూపాయలలో బెట్టింగ్స్ వేస్తున్నారు. బరుల్లో పందేల విజేతలకు బహుమతులు, క్యాష్ ప్రైజ్ పై ముందుగానే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కోడి పందేలు చూసేందుకు సైతం గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ప్రజలు పందేలు చూసేందుకు వెళ్తున్నారు.
ఏపీలో ఉదయం పూట భోగి మంటలు వేసి తమ జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రజలు ఆకాంక్షించారు. ఓవైపు ఇళ్లల్లో రుచికరమైన పిండి వంటలు చేస్తుంటే, మరోవైపు కోడి పందేలు, గుండాట, జల్లికట్టు ఆటలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించడంతో ప్రజల్లోనూ వాటిని వీక్షించేందుకు ఆసక్తి పెరిగింది.