హైదరాబాద్: రాష్ట గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లును ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల నెరవేరబోతోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తోందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఇంటిని మంత్రి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేదల కల నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కేవలం పేదవారయితే చాలు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో పేదవాడికి తీయని కబురు చెబుతున్నామని అన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయబోతున్నామని అన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగబోతోందన్నారు. రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 12 వేలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ భరోసా పథకం ధ్వారా రూ.12 వేలు రెండు విడతలుగా ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.