సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల హంగామా ఊపందుకుంది. డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ బరిని ఏర్పాటు చేశారు. ఈ బరికి సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేకంగా తెలంగాణకు చెందిన ఓ సంస్థ చేపట్టింది. దాదాపు రూ. కోటి ఖర్చు చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ బరిలో పాల్గొనడానికి ఎంపిక చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
మురమళ్ల బరిని ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లు, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఏర్పాటుచేశారు. అతిథుల కోసం వంటగాళ్లను తీసుకువచ్చి ప్రత్యేక వంటకాలు అందిస్తున్నారు. అటు, పక్కనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు పూర్తయ్యాయి. సముద్రతీర ప్రాంతమైన యానాం, ఆత్రేయపురం ప్రాంతాల్లో సైతం పందేల హంగామా కొనసాగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో విద్యుత్ దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక గ్యాలరీలతో బరులను రూపొందించారు. పందేలు చూడటానికి వచ్చే వీరాభిమానుల కోసం ప్రత్యేక ప్రవేశ పాస్‌లు, ఫుడ్ టోకెన్లు ముద్రించారు. వీఐపీలకు ప్రత్యేక మార్గాల్లో ప్రవేశం కల్పించారు. కొన్ని బరుల్లో టాస్ వేసేందుకు గోల్డ్ కాయిన్లు సిద్ధం చేసినట్లు సమాచారం.
కృష్ణా జిల్లా బాపులపాడు, కంకిపాడు మండలాల్లో భారీ ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. అంపాపురం, ఉప్పులూరు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు, ఇనుప ఊచలు, రేకుల షెడ్లతో పందేల ప్రాంగణాలను తీర్చిదిద్దారు. అంపాపురంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడం విశేషం. ఉప్పులూరులో వేయించిన బరికి వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఆకర్షణగా నిలుస్తోంది. పందేల నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రాధాన్యత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి బరికి సంబంధించి ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ప్రత్యక్షమవుతున్నాయి. పందేల ద్వారా రూ. వందల కోట్ల వ్యాపారం జరగనుందని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఈ కోడి పందేల సందర్భంలో వెలుగులోకి వస్తోంది. సంక్రాంతి పండుగకు కోడి పందేలు ప్రత్యేకమైన ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుండగా, ఆ ఉత్సవాలు మరింత దుమ్ము రేపుతున్నాయి.