ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా
ఏపీలో ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ పంపిణీదారుగా ఉన్న ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ను తమ జేబు సంస్థగా వాడుకుని అందులో భారీ ఎత్తున ఉద్యోగుల్ని సిఫార్సులతో నియమించారు. వీరితో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఫైబర్ నెట్ కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయి. దీంతో ఇందులో ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రక్షాళన చేపట్టిన జీవీ
ముఖ్యంగా వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించారన్నారు. వీరంతా వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. అందుకే వీరిని గుర్తించి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా అక్రమ నియామకాలపై దృష్టిపెట్టడంతో పాటు ఫైబర్ నెట్ కనెక్షన్ల ఛార్జీల తగ్గింపు, కొత్త కనెక్షన్లను తక్కువ ధరకే ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.