ఏపీ లోని పరవాడ ఫార్మాసిటీలో మరోసారి విష వాయువుల లీకేజీ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీక్ కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కంపెనీ యాజమాన్యం అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించింది.
విష వాయువుల లీకేజీ వల్ల కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పరవాడ ఫార్మాసిటీలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విష వాయువుల లీకేజీ ఘటనలు జరిగాయి. నవంబర్ 26న జరిగిన ఓ ప్రమాదంలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి చెందాడు, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన తర్వాత కార్మికుల భద్రతపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, మరో ప్రమాదం జరగడం దురదృష్టకరం.
డిసెంబర్ 6న శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్స్ కార్మికులపై పడటం వల్ల వారికి తీవ్ర గాయాలు కావడం స్థానికులను తీవ్ర కలవరం కలిగించింది. తరచూ జరిగే ప్రమాదాలతో ఫార్మాసిటీ కార్మికులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫార్మాసిటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు పెంచడంతో పాటు, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం గమనార్హం.