దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు అయిన అయోధ్య, కాశీల తీరులో, ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను విశ్వవ్యాప్తం చేసే దిశగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు ముందడుగులు వేస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 భాగంగా తిరుమల విజన్-2047ని రూపొందించి, ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతను మిళితం చేస్తూ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి చర్యలు ప్రారంభించారు. తిరుమల విజన్-2047 ద్వారా టీటీడీ ప్రధాన లక్ష్యం, ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే. పర్యావరణ పరిరక్షణ, వారసత్వ కట్టడాల సంరక్షణ, భక్తులకు అందుబాటు సౌకర్యాలను మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల విశ్వవ్యాప్త పుణ్యక్షేత్రంగా ఎదగడానికి వీలుగా ఆధునిక టౌన్ ప్లానింగ్ నిబంధనలను అనుసరిస్తూ, పవిత్రతను కాపాడేందుకు శాశ్వత వ్యూహాలను అమలు చేయనున్నారు. గతంలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగినప్పటికీ, ప్రస్తుతం అవసరాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడంతోపాటు తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు టీటీడీ ప్రాధాన్యం ఇస్తోంది. ఆలయ చరిత్రకు సంబంధించిన కట్టడాలను సంరక్షించి, వాటి పవిత్రతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. తిరుమల పరిసరాల పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా, ఆ ప్రాంతానికి అనుగుణంగా పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు అందించేందుకు టీటీడీ కట్టుబడి ఉంది. దర్శనం సౌకర్యాలు, వసతిగృహాలు, ట్రాన్స్‌పోర్ట్, ఆరోగ్యసేవలు వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తిరుమల ప్రాంతాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయనున్నారు. తిరుమలను అయోధ్య, కాశీ తరహాలో అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం టీటీడీ ప్రధాన లక్ష్యం.