ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సిరీస్‌ను తేల్చే కీలక పోరుగా మారింది.అయితే మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే భారత జట్టుకు ఊహించని ఆందోళన కలిగించే పరిణామం జరిగింది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో గాయపడడం అందరికీ షాక్ ఇచ్చింది.నెట్స్ సెషన్‌లో రోహిత్ శర్మ మోకాలికి గాయం తగిలింది.మొదట మామూలు గాయం అనుకున్నప్పటికీ, నొప్పి ఎక్కువ కావడంతో వైద్య బృందం అతనికి చికిత్స అందించింది. ఫిజియోలు రోహిత్ మోకాలికి ప్రత్యేక పట్టీలు కట్టారు.ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే రోహిత్ కుర్చీలో కూర్చొని నొప్పిని తట్టుకోవడం చూశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని, వైద్య బృందం పరిస్థితిని పరీక్షించిన తర్వాత మాత్రమే మ్యాచ్ ఆడగలిగే పరిస్థితిపై నిర్ణయం తీసుకుంటారని జట్టు వర్గాలు తెలిపాయి.ఈ పరిణామం నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఒత్తిడిని పెంచింది. రోహిత్ శర్మ గాయానికి ముందే టీమిండియా మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఇప్పటికే గాయం కారణంగా అతను సిరీస్‌లో పూర్తిగా పాల్గొనలేకపోయాడు. నాలుగో టెస్ట్‌కు అతను ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇంకా నిలిచే ఉంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియా బ్యాటింగ్ క్రమం పటిష్టంగా ఉండేలా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.జట్టులో గాయాల సమస్యల మధ్యలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ నెట్స్‌లో గట్టిగా శ్రమిస్తున్నారు.వీరు సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడిపి తమ ఫామ్‌ను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నారు. భారత జట్టు ముఖ్యంగా బౌలింగ్ విభాగంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫోంకి పదును పెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. నెట్స్‌లో జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో తమ సత్తా చాటుతున్నారు.