టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో ఈ వార్త రావడంతో అభిమానులతో పాటు టీమ్ సభ్యులు కూడా షాక్ అయ్యారు.ముఖ్యంగా బ్రిస్బేన్ టెస్టు ముగిసిన వెంటనే వచ్చిన ఈ ప్రకటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.అశ్విన్ రిటైర్మెంట్ అంశంపై అభిమానుల అభిప్రాయాలు మాత్రమే కాకుండా భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు.ప్రధాని నరేంద్రమోదీ అశ్విన్ కు ఓ ప్రత్యేక లేఖ రాశారు.ఆ లేఖలో అశ్విన్ కెరియర్ ను కొనియాడుతూ, అతని సేవలకు తన అభినందనలు వ్యక్తం చేశారు. మోదీ తన లేఖలో ఇలా పేర్కొన్నారు అశ్విన్ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి భారత క్రికెట్ కు అందించిన సేవలను మోదీ కొనియాడారు.అంతర్జాతీయ క్రికెట్ లో అతను సాధించిన 765 వికెట్లు ప్రతీదానికి ప్రత్యేకమని అన్నారు.
జెర్సీ నంబర్ 99ను మిస్ అవుతామని ఆవేదన వ్యక్తం చేశారు.అశ్విన్ కెరియర్ ను గురించి మాట్లాడితే, భారత క్రికెట్ చరిత్రలో అతను అందించిన సేవలు అమోఘం. టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు.2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో కీలక సభ్యుడిగా అశ్విన్ పాల్గొన్నారు.ఒకే మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి,సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ తన ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని చాటుకున్నారు.కేవలం ఆటపైనే కాకుండా, జట్టు కోసం అశ్విన్ చేసిన త్యాగాలు మరువలేనివి.తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అశ్విన్ తన సమయాన్ని జట్టు కోసం ఖర్చు పెట్టారు. చెన్నైలో వరదల సమయంలో కూడా తన కుటుంబంతో కాకుండా జట్టుతోనే గడిపారు.మోదీ లేఖలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అశ్విన్ తన క్రికెట్ ప్రేమను కొనసాగించే మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు.ఆట నుంచి తప్పుకున్నా, ఆటకు సేవ చేయగల మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డారు.