భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ ఈ నెల 25, 26వ తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ICAR-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారని, అక్కడే సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. 25వ తేది రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన జరిగే రెండు రోజుల పాటు బ్లూ బుక్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్యవయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రంగా రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ లు, ఉప రాష్ట్రపతి కార్యాలయంతో, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీ ఎస్ ఆదేశించారు.
పోలీసు శాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్త్ చేయాలని డిజిపిని ఆదేశించారు. ఈ పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. భారత ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని R&B శాఖకు సూచించారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ యం.డిని ఆదేశించారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ విభాగం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
26వ తేదీ ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణం వరకు సంబంధిత విభాగాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ ఆదేశించారు.