భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. అందులో సుశీలా మీనా అనే బాలిక తన ఎడమ చేతివాటంతో వేగంగా బౌలింగ్ చేస్తున్నది కనిపిస్తుంది.ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే, ఆ అమ్మాయి బౌలింగ్ యాక్షన్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ని గుర్తు చేస్తుంది. సచిన్ కూడా ఈ విషయం ప్రస్తావిస్తూ, “సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్‌లో జహీర్ ఖాన్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అంటూ తన అభిప్రాయాన్ని షేర్ చేశారు.ఈ వీడియోతో పాటు సచిన్ తన ట్వీట్‌లో, “ఎంతో సరళంగా, పెద్దగా శ్రమ లేకుండా బౌలింగ్ చేయడం చూడటం చాలా చక్కగా అనిపించింది. జహీర్ ఖాన్.ఈ చిన్నారి బౌలింగ్ చూసి నీకేమైనా గుర్తు వస్తుందా? ఈ వీడియో చూశావా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
ఈ ట్వీట్‌పై అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.సచిన్ పంచుకున్న ఈ వీడియో పట్ల ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ స్పందించింది. వీడియోలో కనిపించిన సుశీలా మీనా ప్రతిభను ప్రశంసిస్తూ, “ఇలాంటి టాలెంట్‌ను గుర్తించినందుకు సచిన్‌కి ధన్యవాదాలు. ఈ అమ్మాయి బౌలింగ్ నైపుణ్యం అద్భుతం. తాము చేపట్టే ‘ఫోకస్ ఫర్ గుడ్’ కార్యక్రమం కింద సుశీలా క్రికెట్ ప్రస్థానానికి పూర్తి మద్దతు అందిస్తామ”ని హామీ ఇచ్చింది. సుశీలా మీనా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె క్రికెట్‌లో తగిన ప్రోత్సాహం పొందితే, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు చక్కని బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ ఒక వీడియో పంచుకోవడం అంటే అది వెంటనే వైరల్ కావడం ఖాయం. సుశీలా మీనా టాలెంట్ గురించి భారత క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.