షట్‌డౌన్ గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థిక ప్రతిష్ఠంభన నెలకొనేది. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపగా అక్కడ కూడా ఆమోదం లభించింది. ఈ కీలక బిల్లుకు ఆమోదం లభించడంతో అమెరికా షట్‌డౌట్ గండం నుంచి తప్పించుకున్నట్లైంది.
బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేండ్లపాటు సస్పెండ్ చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కొత్త బిల్లుకు ట్రంప్ మద్దతు తెలపడంతోపాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. కానీ, ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది.
బిల్లుకు క్లిష్టంగా ఆమోదం
ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెనేట్‌లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్‌డౌన్ తప్పదని, ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది.