భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రస్తుతం తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆయన నిర్వహిస్తున్న దుస్తుల కంపెనీలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నిధుల అవకతవకలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ, తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది.ఉతప్ప డైరెక్టర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ,ఉద్యోగుల జీతాల నుంచి సుమారు రూ.23,36,602 పీఎఫ్ నిధులు మినహాయించినప్పటికీ, ఆ నిధులను పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారం క్రమంగా బయటకు రావడంతో, ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది.ఈ క్రమంలోనే డిసెంబర్ 4న రాబిన్ ఉతప్పపై అధికారికంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.తాను తీసుకున్న నిధులను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం కోసం ఈనెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు.ఈ సమయానికి బకాయిలు చెల్లించకపోతే, అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. 39 ఏళ్ల రాబిన్ ఉతప్ప, భారత జట్టుకు తాను అందించిన సేవలతో గుర్తింపు పొందారు.
59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన, మొత్తం 1,183 పరుగులు చేసి, 7 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఉతప్ప అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేయర్‌గా కొనసాగారు. ప్రస్తుత ఘటనపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. “ఉతప్పతో పాటు, ఇతర డైరెక్టర్లు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిధులు మళ్లించినట్లయితే ఇది తీవ్రమైన నేరం,” అని అధికారులు తెలిపారు. ఉద్యోగుల నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడటం చాలా గంభీరమైన వ్యవహారమని వెల్లడించారు. తన క్రికెట్ కెరీర్ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఉతప్ప, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ఈనెల 27 నాటికి పరిష్కారం లేకపోతే, ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఈ వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.