న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరులో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 హెలికాప్టర్ 2021 డిసెంబర్ 8వ తేదీన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదం పట్ల రక్షణశాఖ స్థాయి సంఘం కమిటీ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో పైలట్ తప్పిదమే ప్రధాన కారణంగా వెల్లడించబడింది. మానవ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై నివేదికను రూపొందించడానికి మూడు సంవత్సరాలు పట్టింది. బుధవారం కమిటీ ఈ నివేదికను లోక్‌సభకు అందజేసింది. అందులో మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది.
కాగా, 18వ లోక్‌సభ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2017 నుంచి 2022 మధ్యలో మొత్తం 34 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రమాదాలు జరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రమాదాలు నమోదయ్యాయి. 2021 డిసెంబర్ 8న జరిగిన ప్రమాదాన్ని కమిటీ ”హ్యూమన్ ఎర్రర్ (ఎయిర్‌క్రూ)”గా నిర్ధారించింది. ప్రమాద సమయంలో వాతావరణం అనూహ్యంగా మారిపోవడం, హెలికాప్టర్ మేఘాల్లోకి ప్రవేశించడం ప్రమాదానికి దారితీసిన అంశాలుగా పేర్కొంది. ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ, సాక్షుల విచారణ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చింది.
2021 డిసెంబర్ 8న జరిగిన ఈ దుర్ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇంకా 12 మంది సిబ్బంది సూలూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ కొండలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, కానీ చికిత్స పొందుతూ వారం తర్వాత ఆయనకూడా మరణించారు. బిపిన్ రావత్ జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021లో మరణించే వరకు భారత సాయుధ దళాల తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పని చేశారు. భారత ప్రభుత్వం ఆయనకు 2021లో పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.