హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది.
గత ప్రభుత్వం హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల బదలాయింపు పై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.50 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి అనుమతి కోరింది రేవంత్ సర్కార్. తాజాగా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీసంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోని అధికారుల పాత్రపై దర్యాప్తునకు అనుమతి రాగా… అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విచారణ జరపాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోరగా.. ఇటీవలే అనుమతి వచ్చింది.
విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఏసీబీ విచారణలో పూర్తిస్థాయిలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రాథమిక విచారణలో లభించే ఆధారాల తర్వాత ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు అప్పటి అధికారులను విచారించే అవకాశం స్పష్టంగా ఉంది.