సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం వస్తుంటారు. కోడి పందేలు చూసేందుకు వచ్చే ప్రజల సందడితో పండుగ ఉత్సాహం మరింత పెరుగుతుంది.
ఈ పందేల కోసం కోడి పుంజులను ప్రత్యేకంగా సిద్ధం చేయడం ఆనవాయితీ. బాదం, జీడి పప్పుల వంటి పోషక ఆహారాలను అందించడం ద్వారా కోడి పుంజులు మరింత బలంగా తయారు చేస్తారు. పందేలు పాల్గొనబోయే కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణను కూడా ఇస్తుంటారు. సంక్రాంతి సమీపిస్తున్న క్రమంలో కోడి పందేల పోటీకి సిద్ధం చేసేందుకు రైతులు, కోడి యజమానులు ఏర్పాట్లు ప్రారంభించారు. పందేలు ప్రధానంగా జాతులను బట్టి విభజించబడతాయి. కోడి పుంజులకు సంబంధించిన జాతులు సేతువు, నెమలి, కాకిడేగ, పర్ల, పచ్చకాకి డేగ, ఆబ్రస్, ఎర్రకెక్కిరాయి మొదలైనవి ఉన్నాయి. ప్రతి జాతికి ప్రత్యేక లక్షణాలు ఉండడం విశేషం. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకత ఉండటం వల్ల వీటి మీద పెద్ద ఎత్తున పందేలు సాగుతాయి. ఈ కోడి పుంజులకు డిమాండ్ పెరిగేకొద్దీ ధరలు కూడా పెరుగుతుంటాయి. కోడి పందేలలో కోడి పుంజుల విజయం సాధించడం కోసం యజమానులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. పందేలు నిర్వహణ, కోడి పుంజుల ఆరోగ్యం, పోషణ వంటి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు. పందేల కోసం సిద్ధం చేసిన కోడి పుంజుల ధర రూ. 10వేల నుంచి లక్ష వరకు ఉంటుండడం గమనార్హం. డిమాండ్ బాగా ఉన్న కోడి పుంజుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సంక్రాంతి కోడి పందేల హడావిడి ప్రజలలో కొత్త ఉత్సాహం నింపుతుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందేల సందడితో ఊళ్లన్నీ కిక్కిరిసిపోతాయి. పందేలు చూడటమే కాకుండా, వాటి వెనుక ఉన్న ప్రత్యేక సన్నాహాలను చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఈ సాంప్రదాయం గోదావరి, కృష్ణా జిల్లాల్లో పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.