హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగులయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటకు చలించని హృదయం లేదన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. మొగులయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
‘నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది. మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది. మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, జానపద కళాకారుడు, ‘బలగం’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన మొగిలయ్య (67) ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన ఆయన ఇటీవల వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చేరగా, ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.