అమరావతి: పీసీసీ చీఫ్ షర్మిల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై విమర్శలు గుప్పించారు. అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అని ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనన్నారు.
అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాడ్ చేశారు. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నానని షర్మిల తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందని షర్మిల ఆగ్రహించారు.
మరోవైపు రాజ్యాంగ నిర్మాతను అమిత్ అగౌరవపరిచారని ఆరోపించిన ఖర్గే, మంగళవారం రాజ్యసభలో తన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. “బాబాసాహెబ్‌కు గౌరవం ఉంటే, అమిత్ షాను వెంటనే తన మంత్రివర్గం నుండి తొలగించాలని నేను ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్నాను” అని ఖర్గే ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవి, వారు పూజనీయులుగా భావించే దళిత హీరోని ఆయన అవమానించారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని ఖర్గే అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడానికి బదులు మోడీ తన హోంమంత్రిని సమర్థిస్తున్నారని ఆయన ప్రధానిపై మండిపడ్డారు.