మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కలవడం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీషలతో పాటు వేదికను పంచుకున్నారు. అంతేకాదు టీడీపీ నేతలతో కలిసి వాహనంపై ఊరేగారు. దీంతో, ఈ ముగ్గురు టీడీపీ నేతలపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తితో కలిసి వేదికను పంచుకోవడం ఏమిటని ఏకిపారేస్తున్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు.
పార్టీకి ద్రోహం చేయను
ఈ నేపథ్యంలో కొనకళ్ల నారాయణ స్పందిస్తూ… జోగి రమేశ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై చంద్రబాబును కలిసి వివరిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడూ చేయనని… ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, అనుకోకుండా జరిగిందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకే తాను వెళ్లానని… జోగి రమేశ్ తో తనకు ఎలాంటి పరిచయాలు లేవని తెలిపారు. జోగి రమేశ్ వస్తున్నట్టు తనకు సమాచారం లేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదనే ఉద్దేశంతోనే జోగి రమేశ్ వచ్చినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.
నానికి శిక్ష తప్పదు
రేషన్ బియ్యం మాయం అయిన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని శిక్ష అనుభవించక తప్పదని నారాయణ చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని దోచుకుతున్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. పక్కదారి పట్టిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరని చెప్పారు.