సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర పోస్టులపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మరియు ఇతర రాజకీయ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా, అల్లు అర్జున్ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా దూషణలకు దిగడంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు . సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఉపయోగించి పెట్టిన పోస్టులపై కూడా నిఘా పెంచినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కొందరు పోస్టులు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి పోస్ట్‌లు సమాజంలో కలహాలను రెచ్చగొడతాయని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలను తమ భావాలను తెలియజేయడానికి ఉపయోగిస్తున్నామే కానీ దాన్ని తప్పుగా చెప్పడం తగదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. తమకు కూడా మాట స్వేచ్ఛ ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.