మహిళలు, విద్యార్థినుల భద్రతకు అండగా నిలిచేలా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మహిళా కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారికి ప్రత్యేక విధులు కేటాయించారు. ఈ కార్యక్రమం మహిళా భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టిన మరో ముఖ్యమైలు రాయిగా నిలుస్తోంది. ‘పోలీస్ అక్క’గా నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు, షీ టీమ్స్‌తో కలిసి పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి పోక్సో చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థినులకు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తమ సమస్యలను నేరుగా వినిపించుకోవడానికి ఓ ‘పోలీస్ అక్క’ అందుబాటులో ఉండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆచరణాత్మకంగా ఉపయోగపడుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలపై నేరాలను తగ్గించడం, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోంది. సిరిసిల్లలోని ఈ ప్రయత్నం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తూ, మరిన్ని సానుకూల మార్పులకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.