ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ఫారమ్‌లకు అడ్వైజరీని జారీ చేసింది. డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్లామరైజ్ కంటెంట్‌ను చూపిస్తే.. దానిపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
డ్రగ్స్‌పై ప్రచారం చేయవద్దు
సిరీస్‌లు, ఇతర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న సమయంలో డ్రగ్స్‌పై ప్రచారం చేయొద్దని సూచించింది. సినిమాలు, సీరియల్స్‌లో నటులు మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని చెప్పింది. డ్రగ్స్ వినియోగాన్ని చూపించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది. అలాంటి సున్నితమైన కంటెంట్ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సీన్స్ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాల్సిందేనని చెప్పింది. దేశంలో డ్రగ్స్ వాడకం రోజురోజుకు పెరుగుతున్నది. పిల్లలు స్కూల్ వయసు నుంచి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, సమాజానికి హానికరంగా మారుతున్న ఈ సమస్యపై ఉక్కుపాదంతో అణచివేయాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ప్రభావం సమాజంపై తీవ్రంగా వుందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేంద్రం కూడా కఠినంగా వుంది.