ఏడాదిగా మణిపూర్ లో జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణతో వందలాది మంది చనిపోయారు. అనేకులు తమ నివాసాలను కోల్పోయారు. రాష్ట్రం ఏడాదిగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. బీరేన్ సింగ్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో ఈ తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబును గుర్తించిన సమయంలో బీరేన్ సింగ్ నివాసంలో లేరని తెలుస్తోంది.
మణిపూర్ లో గత కొంత కాలంగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనీ ఆ పార్టీ వారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉండొచ్చని… అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.