హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమవుతుందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఇన్వెస్టర్లకు భయాన్నిపుట్టించాయని ఆయన పేర్కొన్నారు. “చంద్రబాబు తిరిగి రాగానే అమరావతిలో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పడం ఒక వాదన మాత్రమే. నిజంగా అమరావతి పెట్టుబడులకు సరైన వేదికగా మారడం అనుమానాస్పదం” అని మంత్రి అన్నారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనమవుతుందనే ప్రచారం నిజం కాదని, ఇక్కడ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వైపే పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మీద ప్రారంభంలో కొంత తప్పుడు ప్రచారం జరిగినా, ఇప్పుడు నగరం పెట్టుబడులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది అని తెలిపారు. అలాగే బెంగళూరు కూడా పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన కేంద్రంగా ఉందని అన్నారు.
అమరావతి ప్రాంతంలో వరదల ప్రభావం ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని మంత్రి పొంగులేటి అన్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలు పెట్టుబడిదారులలో సందేహాలు రేకెత్తించాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితోపాటు, ప్రాజెక్టుల పూర్తి అవుట్‌లుక్ మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొనసాగుతున్నందున పెట్టుబడిదారులు అమరావతికి కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అమరావతిలో తగిన ప్రణాళికలు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితేనే ఇన్వెస్టర్లు ఆ దిశగా చూస్తారు అని సూచించారు.