బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధ నడుస్తున్నది. తెలంగాణ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరూపించింది. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ.3,89,673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. అందువల్ల తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.