హైదరాబాద్: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సభ సమావేశాలను వారంపాటు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఆ తర్వాత, తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసనమండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.
కాగా, గత సోమవారం సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణతల్లి నూతన విగ్రహం, రూపురేఖలు వంటి అంశాలపై సభలో చర్చించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ సభ్యులను ఉభయసభల్లోకి ఉద్దేశపూర్వకంగానే రాకుండా చేసి, ప్రభుత్వం చర్చ పెట్టిందనే విమర్శలు వినిపించాయి. తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిని కాదని, అభయహస్తం తల్లిని ఉద్దేశపూర్వకంగా రుద్దాలనే కుట్రను ప్రభుత్వం చేసిందని, ఆ బండారం అంతా తాము బయటపెడతామనే భయంతోనే తమను ముందస్తుగానే సభకు రాకుండా అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.