ప్రపంచ ప్రఖ్యాత మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా ప్రారంభం కానుంది.ఈ పవిత్ర జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పుణ్యస్నానాలు చేయడానికి ఈ ఏర్పాట్లు చేపడుతున్నారు. స్నానోత్సవాల కోసం ప్రత్యేక షటిల్ బస్సుల నుంచి అత్యవసర సేవల వరకు పలు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం కు భక్తులను చేర్చేందుకు 350 షటిల్ బస్సులను రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది.ఈ బస్సులు ప్రత్యేకంగా కుంకుమ రంగులో ఉండేలా డిజైన్ చేశారు. భక్తులు ఈ సేవలను సులభంగా ఉపయోగించుకునేలా, 22 మంది అధికారులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది.అదనంగా, వారణాసి రోడ్‌వేస్ ప్రత్యేకంగా 50 కుంభ్ షటిల్ బస్సులను సిద్ధం చేసింది.ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే ఏడు ప్రధాన మార్గాల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు మోహరించనున్నాయి.
మహా కుంభమేళా కోసం మూడు దశల్లో బస్సులను నడపనున్నారు:1.మొదటి దశ: జనవరి 12 నుంచి 23 వరకు. 2. రెండో దశ: జనవరి 24 నుంచి ఫిబ్రవరి 7 వరకు.3. మూడో దశ: ఫిబ్రవరి 8 నుంచి 27 వరకు. మొదటి మరియు మూడవ దశల్లో 10 ప్రాంతాల నుంచి 3050 బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. రెండో దశలో, ముఖ్యంగా మౌని అమావాస్య మరియు వసంత పంచమి స్నానోత్సవాల కోసం 7000 బస్సులను రోడ్లపైకి తెస్తారు. ప్రధాన స్నానోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నారు. అదనంగా, 200 సిటీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా షటిల్ సేవలో ఉంటాయి. ఈ సౌకర్యాలు భక్తుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తాయి. భక్తుల సౌలభ్యం కోసం 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ (1800 1802 877) మరియు వాట్సాప్ నంబర్ (94150 49606) అందుబాటులో ఉంటాయి. అలాగే, మొబైల్ డీజిల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.