ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం శనివారం ఉదయం తన మేనత్త, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బన్నీ జైలు నుంచి విడుదల అయిన వెంటనే సురేఖ భేటీ కావడం భావోద్వేగానికి గురిచేసింది. అల్లుఅర్జున్ పరిస్థితి పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిల్ మంజూరైనా, పోలీసులు ఆలస్యం చేయడంతో అల్లుఅర్జున్ ఒక రాత్రి జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ విషయంలో పలువురు ప్రముఖులు పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ ఇంటికి పలువురు ప్రముఖులు వస్తుండగా, సురేఖ ఆయన కుటుంబానికి మద్దతు ఇచ్చారు.
అల్లుఅర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి, నాగబాబు నిన్న బన్నీ ఇంటికి వెళ్లి మాట్లాడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులంతా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసారు. అల్లు అర్జున్ మీద నమోదైన కేసును మృతురాలు రేవతి భర్త భాస్కర్ వెనక్కి తీసుకుంటానని నిన్న ప్రకటించడంతో పరిస్థితి కొంత సానుకూలంగా మారింది. ప్రస్తుతం బన్నీ ఇంటికి పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. అభిమానులు ఈ పరిణామాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. మెగా కుటుంబం అంతా అల్లుఅర్జున్ వెనుక నిలబడడం ఆయనకు మానసిక బలం చేకూర్చింది.