న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు హర్యానా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసులను సస్పెండ్ చేసింది. అంబాలాలోని 12 గ్రామాల్లో డిసెంబర్ 17వ తేదీ వరకు ఆ ఆంక్షలు విధించారు. రైతులు ఢిల్లీకి మార్చింగ్ నిర్వహించనున్నట్లు కిసాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు.డిసెంబర్ 6, 8వ తేదీల్లో చేసిన ప్రయత్నాలను హర్యానా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
శాంతియుతంగా చేపడుతున్న ధర్నాలకు ప్రభుత్వ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా పబ్లిక్ సెంటిమెంట్‌ను డెవలప్ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సంఘవిద్రోహక శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రైతులు పేర్కొన్నారు.
మరో వైపు బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింఘూ, టిక్రి బోర్డర్ వద్ద దాదాపు 700 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు ఆరోపించారు. 2020-2021లో నిరసన చేపట్టిన సమయంలో.. ఆ అమ్మాయిలు కనిపించకుండాపోయారని ఎంపీ రామ్‌చందర్ జంగ్రా తెలిపారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన జంగ్రాను అరెస్టు చేయాలని రైతు సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు.