హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని రూ. 1000 కోట్లకుపైగా విలువైన భూదాన్ భూములను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ప్రైవేటు పరం చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి రావడంతో తాజాగా మర్రి జనార్దన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కేఎస్ఆర్ మైన్స్‌కు చెందని కె.సిద్ధారెడ్డి, అమ్మద డెవలపర్స్‌కు చెందిన సూర్యతేజ తదితరులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎల్లుండి (16న) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అమోయ్ కుమార్ ద్వారా వీరంతా లబ్ధిపొందినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసింది.
భూదాన్ భూములను ప్రైవేటు పట్టా భూములుగా మార్చి వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దస్తగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడీ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.