సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత విడుదల కావడం పట్ల గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌పై మరకలు వేయాలని చూసిన ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి అనుచితమని, ఒక నటుడిని తక్కువగా చూడటం దారుణమని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై చిన్నికృష్ణ తీవ్రంగా స్పందిస్తూ.. “ఇలాంటి చర్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయి. అల్లు అర్జున్‌కు ప్రజల మద్దతు అపారంగా ఉంది. ఆయనను అనవసరంగా ఇరికించాలనుకోవడం దారుణం” అన్నారు. చిన్ని కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.
ఇక సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అటు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో ఆహ్వానించారు. బన్నీ ఇంటికి చేరుకోగానే కుమారుడు అల్లు అయాన్ పరిగెత్తుకుని తండ్రిని హత్తుకోవడం అందర్నీ కలిచివేసింది.
ఆతరువాత భార్య స్నేహ, కూతురు అర్హతో పాటు తల్లి, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారు. కుటుంబం మొత్తం కలిసి ఆయనకు దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనను దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. మరొకసారి రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఎవరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, ఫ్రెండ్స్, సినీ పరిశ్రమ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.